Saturday, July 17, 2010

(అ)ప్రకటనలు

ఈ మధ్య కాలంలో వచ్చే చాలా ప్రకటనలు, హిందీ నుండి తెలుగు లోకి అనువదింపబదినవే. అందులో చాలా ప్రకటనలు " ట్రూ ట్రాన్స్ లేషన్ " అనే ప్రక్రియకు బలి అయినవే. అందుచేత చాలా ప్రకటనలు తాము ప్రకటిద్దాం అనుకున్న భావం భాషలో పలకక ఇబ్బంది పడుతుంటాయి ... మనలను ఇబ్బంది పెడుతుంటాయి.

కానీ కొన్ని డైరెక్ట్ తెలుగు ప్రకటనలు కూడా తమ భావాన్ని భాషలో ప్రకటించలేక పోతున్నాయి అంటే ఒక తెలుగు వాడిగా చాలా బాధ కలుగుతుంది. అటువంటి కొన్ని (అ)ప్రకటనలు ఇక్కడ పొందు పరుస్తున్నాను ...

అంబికా దర్బార్ బత్తి

"అమ్మని మర్చిపోలేము ... అంబికానీ మర్చిపోలేము ..."
ఈ మాటని జాగ్రత్తగా గమనిస్తే స్ఫురించే అర్ధం ఏమిటంటే ... అమ్మని మరియు అంబికానీ మర్చిపోదాం అని ప్రయత్నించినా మర్చిపోలేము అని. నాకు తెలిసి వారి భావం ఈ విధంగా పలికించి ఉండాల్సింది ... "అమ్మనీ మర్చిపోము... అంబికానీ మర్చిపోము".

Monday, February 15, 2010

జీతాలకు రెక్కలొచ్చాయి !

2001 లో ఐ . టి . సంక్షోభం వలన మాకు జీతాలు తగ్గాయి . ఒక సంవత్సరం తరువాత , మరల జీతాలు పెరిగాయి ... అనుకున్నదానికంటే బాగా పెరగడంతో ... ఆనందాన్ని తట్టుకోలేక అక్కకి కవిత కొట్టాను !

అక్కా మా జీతాలకు రెక్కలొచ్చాయి
ఎక్కువ మొత్తంలోనే చెక్కులోచ్చాయి !
ప్రాజెక్టులు పరంపరగ తోసుకొచ్చాయి
మంచి రోజులను మాకై మోసుకొచ్చాయి !!

చక్కబడ్డ జీతాలను చొక్కాలో కుక్కేందుకు
ఈ నెల నుండే మాకా హక్కులోచ్చాయి !

జీతం పెరిగిందంటూ ... చాకిరి పెరిగిందంతే
చేతలు కొత్తవే అయినా ... చేసే పని తీరంతే :-)

రాఖీ !!

రాఖీ పండగకి మా పెద్దక్క పోస్టులో రాఖీ పెట్టి పంపింది. నేను ఊరుకుంటానా ...?! జవాబు జాబులో ... రెండు వందల రూపాయలు పెట్టాను ... ఓ కవిత కొట్టాను ... ఆ కవితే ఇక్కడ పెట్టాను :

అక్కా నీ ఉత్తరం అరుదెంచింది
అందు బంధనం నా మదినలరించింది !
శ్రావణ పౌర్ణమి శోభలు కురిపించింది
తమ్ముడిపై నీదు ప్రేమ తలపించింది !!

అట్టముక్క మీద ఆర్టు చెక్కినట్టు గోచరించు
బంధనాన నీదు ప్రేమ కనిపించింది !
'బుజ్జీ' అని చేరదీసి ప్రేమ తోడ ఆదరించు
అక్కలుండటం లక్కీ అనిపించింది !!

అనుబంధపు సువాసనలు విరియిస్తున్న
బంధనాన్ని కరమున నే ధరియిస్తున్నా !
అర చతుర్ద్ధ శత రూకలు అందిస్తున్నా
ఆశీస్సున అక్షితలను ఆశిస్తున్నా !!